- పిల్‌పై నేడు విచారణ చేయనున్న హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి : కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జాతీయ ఆహార భద్రత చట్టం 2013లోని సెక్షన్ 5 ప్రకారం 14 ఏళ్లు లేదా 8వ తరగతి వచ్చేంత వరకు ఉచిత పోషకాహారం పొందడం విద్యార్థుల హక్కంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ పిల్ వేశారు. ‘ఆహారం పెట్టేలా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్రం 2008 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. గతేడాది రాష్ట్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 87 కరువు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో విద్యార్థులకు ప్రధాన మంత్రి పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజన వసతి సౌకర్యం కల్పించాలి. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది’ అని దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు బుధవారం విచారణ చేయనుంది.