మాకినేని బసవ పున్నయ్య ఆశయ సాధనకు కృషి

  • సిపిఎం నేతలు మధు, వైవి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కామ్రేడ్‌ మాకినేని బసవ పున్నయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎంబివికె మేనేజింగ్‌ ట్రస్టీ పి మధు, ఎంబివికె ట్రస్ట్‌ కార్యదర్శి వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మాకినేని బసవ పున్నయ్య 33వ వర్ధంతిని విజయవాడలోని ఎంబివికెలో నిర్వహించారు. ఈ సందర్భంగా మధు, వైవి మాట్లాడుతూ.. బసవ పున్నయ్య ప్రముఖ ప్రజ్ఞాశీలి అని పేర్కొన్నారు. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలను అధ్యయనం చేసి, సమాజానికి అన్వయించి, ప్రజలను భాగస్వాములు చేశారన్నారు. ఆయన ధనిక, భూస్వాముల కుటుంబంలో పుట్టినప్పటికీ ఆస్తులను ప్రజా జీవితానికి అంకితం చేశారన్నారు. గుంటూరు బాపనయ్య కృష్ణా నది దాటేందుకు పడవ ఎక్కినప్పుడు అగ్రవర్ణాలు అడ్డుకున్న సమయంలో ఆయన బాపనయ్యకు అండగా నిలిచారన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నామని చెప్పుకుంటున్న నేటి రోజుల్లో కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ, కార్మిక, కర్షక, వర్గాలకు అండగా పోరాటాలు చేసేందుకు ఉద్యమాలు నడపాలని మాకినేని బసవ పున్నయ్య పునాది వేశారన్నారు. ప్రపంచ అతి తక్కువ మంది మార్క్సిజం మేధావుల్లో అగ్రగణ్యుడన్నారు. రకారకాల పండగలు, సాహిత్య కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేశారన్నారు. జిల్లాల్లో స్థానికంగా ఉన్న నాయకులు పేరుతో విజ్ఞాన కేంద్రాలు నడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామరాజు, హరికిశోర్‌ పాల్గొన్నారు.

 

➡️