‘జాదూ’ పరిహార(స)o..!

 నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు
 నష్టపరిహారం ప్రకటించినా మూడేళ్లుగా ఇవ్వని వైనం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: కావేరీ జాదూ సంస్థ నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన పత్తి రైతులకు పరిహారం పరిహాసంగానే మిగులుతోంది. మూడేళ్లుగా రైతులకు పరిహారం అందడం లేదు. 2021లో ఎన్నో ఆశలతో ఆరుగాలం కష్టించి సాగు చేస్తే చివరకు పంట చేతికందే సమయానికి సరైన దిగుబడి రాకపోవడంతో తాము కల్తీ విత్తనాల బారిన పడి మోసపోయామని రైతులు గ్రహించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 1,889 మంది రైతులు 7,258 ఎకరాల్లో జాదూ విత్తనాలను సాగు చేసి నష్టపోయారు. కర్నూలు జిల్లాలోని గూడూరు, కల్లూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, నందవరం, మంత్రాలయం, పాములపాడులో రైతులు నకిలీల బారిన పడి నష్టపోయారు. కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనూ జాదూ బాధితులు ఉన్నారు. గూడూరు మండలంలో అధికంగా బాధితులు ఉన్నారు. ఆ మండలంలోని గుడిపాడులో 300 మంది రైతులు మూడు వేల ఎకరాలలో, మునగాలలో 150 మంది రైతులు వెయ్యి ఎకరాలలో, మల్లాపురంలో 50 మంది 600 ఎకరాలలో, పెంచికలపాడులో 30 మంది 200 ఎకరాల్లో కావేరీ జాదూ పత్తి విత్తనాలను సాగు చేసి నష్టపోయారు. కల్లూరు మండలం పర్లలో 40 మంది 300 ఎకరాల్లో సాగు చేసి నష్టాలను మూటగట్టుకున్నారు. సాధారణంగా ఒక ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ఈ కల్తీ విత్తనాల వల్ల ఒక క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. పాములపాడు మండలంలో మిట్టకందాలకు చెందిన ఐదుగురు రైతులు 22 ఎకరాల్లో జాదూ విత్తనాలను సాగు చేశారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ నష్టపోయారు. రైతు సంఘం పోరాటాల ఫలితంగా కల్తీ విత్తనాల వ్యవహారంపై నంద్యాల శాస్త్రవేత్తలు పలు ప్రాంతాల్లో పర్యటించి నమూనాలను సేకరించి నివేదికలు సమర్పించారు. 50 నుంచి 70 శాతం నకిలీ విత్తనాలు ఉండటం వల్లే పంట దిగుబడి తక్కువ వచ్చినట్లు వారు నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ కమిటీ రైతులతో చర్చించి ఎకరాకు రూ.23,370 పరిహారాన్ని అవార్డు ప్రకటించింది. కర్నూలు జిల్లాలో మొత్తం రూ.16.96 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిన కావేరీ జాదూ కంపెనీ కొత్త ఎత్తుగడతో 2022 జనవరి 29న హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కమిటీ ప్రకటించిన రూ.23,370లో 40 శాతం చెల్లించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కావేరీ కంపెనీని ఆదేశించి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ రైతులకు పరిహారం అందలేదు. ఎపి కాటన్‌ సీడ్‌ యాక్ట్‌ కింద కావేరీ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పరిహారం కోసం ఎదురు చూస్తున్నాం
2021 సంవత్సరం ఖరీఫ్‌లో 15 ఎకరాలలో పత్తి సాగు చేశాను. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చింది. ఈ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయాం. నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులు చెప్పినా కంపెనీ ఇవ్వడం లేదు. నష్టపరిహారం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం.. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
– బి.రాజు, భూపానపాడు, పాణ్యం మండలం.

పరిహారం అందేలా చూడాలి
కమిటీ ఇచ్చిన అవార్డులో 40 శాతం చెల్లించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కంపెనీని ఆదేశించారు. అది చాలా తక్కువ మొత్తం. అయినా ఆ పరిహారం అయినా అందుతుందేమో అని రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తక్షణమే పరిహారం అందేలా చూడాలి. పరిహారం ఎగ్గొట్టాలని చూస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలి.

– జి.రామకృష్ణ, రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి.

➡️