- ఇల్లు, ఇళ్ల పట్టాల సమస్య రాష్ట్రాన్ని పీడిస్తోంది: వి శ్రీనివాసరావు
- ఇల్లు లేని పేదల కోసం విశాఖలో సిపిఎం ఆందోళన
- మండుటెండలో వందల సంఖ్యలో హాజరైన నగర పేద ప్రజానీకం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ‘ఇల్లు, ఇళ్ల పట్టాల సమస్య రాష్ట్రాన్ని పీడిస్తోంది. ఇటీవల భీమవరం దగ్గర ఉండీలో పేదలు ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం కూల్చేసింది., బుల్‌డోజ్ రాజకీయ సంస్కృతి మన రాష్ట్రానికీ వచ్చిందా? పేదలను ఉద్దరిస్తామని చెప్పి వారి ఉసురు తీసే పనులకు పాల్పడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ జంక్షన్ నుంచి ఆశీల మెట్ట మీదుగా జివిఎంసి ప్రధాన కార్యాలయం వరకూ బుధవారం ర్యాలీ జరిగింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా పేదలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ర్యాలీ అనంతరం జరిగిన సభకు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, దశాబ్దాల క్రితం పేదలు విశాఖకు ఉపాధి కోసం వచ్చి సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అద్దె కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పాలకులకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. 2014-2019 మధ్య టిడిపి హయాంలో టిడ్కో ఇళ్లు, గత వైసిపి ప్రభుత్వం 2019-2024 మధ్య కాలంలో జగనన్న కాలనీల పేరుతో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి అరకొరగా నిర్మించి పేదలను మధ్యలోనే ముంచేశాయని వివరించారు. కొంతమంది లబ్ధిదారులకు విశాఖలో ధ్రువపత్రాలు మంజూరు చేసినా ఇల్లు అప్పగించలేదని తెలిపారు. టిడ్కో ఇళ్లకు టిడిపి హయాంలో రూ.25 వేలు కట్టించుకున్నారని, జగనన్న కాలనీలకు ఒక్కొక్కరి నుంచి రూ.35 వేలు తీసుకున్నారని, అయినా, ఒక్క ఇంట్లోనూ పేదవాడు ప్రవేశించే పరిస్థితి ఈనాటికీ లేదని అన్నారు. ఈ డబ్బులను పేదలు వడ్డీలకు తెచ్చి కట్టారని, అప్పు తీర్చలేక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పాలకులకు పట్టడం లేదని తెలిపారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి కనీసం రూ.5 లక్షలు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదేనా మీ వాట్సాప్ పాలన?
ప్రభుత్వం తమది వాట్సాప్ పరిపాలనని, వాట్సాప్ ద్వారా 250 రకాల దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్తోందని వి.శ్రీనివాసరావు అన్నారు. ఇంటి కోసం దరఖాస్తు పెడితే వాట్సాప్‌లో పట్టా రావాలని, అదీ వాట్సాప్ పాలన అంటే అని, ఆ పరిస్థితి లేదని వి.శ్రీనివాసరావు అనడంతో సభలో పేదలంతా ఒక్కసారిగా సిపిఎం పేదల పార్టీ అంటూ నినాదాలు చేశారు.
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ ‘మండుటెండను సైతం లెక్కచేయకుండా వచ్చిన రెక్కాడితేగానీ డొక్కాడని వందలాది పేదలను చూసైనా టిడిపి కూటమి పాలకులకు మనసు కరగడం లేదా? కనీసం ఇల్లు, ఇంటి స్థలాలు, పట్టాలు ఇవ్వలేరా? అంటూ ప్రశ్నించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ గతంలో డీడీలు కట్టిన పేద లబ్ధిదారుల పేర్లను టిడిపి కూటమి పాలకులు రద్దు చేసినట్లు తెలుస్తోందని, జాబితాల నుంచి వారి పేర్లు తొలగిస్తే సిపిఎం క్షమించబోదని హెచ్చరించారు. డబ్బులు కట్టిన వారందరికీ ఇల్లు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ధర్నా శిబిరంలో బొట్టా ఈశ్వరమ్మ ప్రజా సమస్యలను ప్రస్తావించారు.
ధర్నా శిబిరం వద్దకు వచ్చి హామీ ఇచ్చిన జివిఎంసి ఎడిసి వర్మ
జివిఎంసి ఎడిసి వర్మ ధర్నా శిబిరం వద్దకు వచ్చి ‘టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నెల రోజుల్లో వివరాలు అందజేయాలని కోరిందని, జిఒ కూడా ఇచ్చిందని, గతంలో సిద్ధమైన జాబితాను ప్రభుత్వానికి పంపి పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వికుమార్, బి.జగన్, పి.మణి, జోన్ కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు, పేదలు పాల్గొన్నారు.