పాల సేకరణ ధర తగ్గింపుపై మహాధర్నా

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : పాల సేకరణ ధరను విశాఖ డెయిరీ యాజమాన్యం తగ్గించడంపై పాల రైతులు భగ్గుమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారంతా విశాఖ నగరంలోని గాజువాకకు సమీపంలో ఉన్న డెయిరీ వద్దకు తరలివచ్చి ప్రధాన ద్వారం వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు. నవంబర్‌ 1న చెల్లించే పేమెంట్లలో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ధరను పెంచి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ పాల రైతు సంఘం (అఖిల భారత కిసాన్‌ సభ అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నా ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ ఆవు పాల సేకరణ ధరను డెయిరీ యాజమాన్యం లీటరుకు రూ.3 మేర తగ్గించడం దారుణమన్నారు. రైతులకు ఆవు పాల లీటరుకు రూ.50, గేదె పాలకు రూ.80 ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ సహకార రంగం వల్ల లాభం లేదని చెప్పి విశాఖ డెయిరీని కంపెనీ యాక్ట్‌లోకి తీసుకొచ్చి స్వేచ్ఛగా వారి వ్యక్తిగత వ్యాపారాలను యాజమాన్యంలో ఉన్నవారు పెంచుకున్నారని విమర్శించారు. డెయిరీ లాభాలు ప్రయివేటుగా దారిమళ్లుతున్నాయన్నారు. డెయిరీలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పాల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.అజరు కుమార్‌ మాట్లాడుతూ స్థిరాస్తులను కాజేయడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సహకార నిబంధనల ప్రకారం లాభాల్లో నుంచి బోనస్‌ను రైతులకు చెల్లించాల్సి ఉందని, 2006వ సంవత్సరం నుండి ఇవ్వడం లేదన్నారు. పాల రైతుల సొసైటీలతో చర్చించకుండా ఏకపక్షంగా పాల ధర తగ్గించడం సరికాదన్నారు. సహకార స్ఫూర్తికే ఇది విరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్దరాజు రాంబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కర్రి అప్పారావు, గండి నాయనబాబు, ఎస్‌.బ్రహ్మాజీ, ఎం.అప్పలరాజు, వెలమల రమణ, జగన్‌, ఆర్‌.రమణమూర్తి, పెద్ద సంఖ్యలో మహిళా పాడి రైతులు పాల్గొన్నారు. ధర్నా వద్దకు విశాఖ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌వి.రమణ రాగా ఆయనకు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. త్వరలో డెయిరీ బోర్డులో చర్చించి ధరపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

➡️