ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జాతిపిత మహాత్మాగాంధీ బోధనలు జాతికి మార్గదర్శకంగా నిలుస్తాయని గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ 155వ జయంతి నేపధ్యంలో గవర్నర్ ప్రజలనుద్దేశించి మంగళవారం ఆయన విడుదల చేసిన సందేశంలో గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. శాంతియుత ప్రతిఘటన, సామూహిక శాసనోల్లంఘన మార్గం ప్రపంచ వ్యాప్తంగా అనుసరించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నాయకులకు ప్రేరణగా నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సత్యం, అహింస సూత్రాలకు మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నట్లు ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ పేర్కొన్నారు.
