- రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట నిరసనలు
ప్రజాశక్తి – యంత్రాంగం
నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళా లోకం కన్నెర చేసింది. ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహత్మా గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలు చేయాలని, పూర్తి స్థాయిలో మత్తు పదార్ధాలను నిషేధించాలని నినాదాలు చేశారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ మద్యం ఏరులై పారుతోందని, మహిళలపై హింస రోజురోజుకూ పెరుగుతోందని పలువురు నేతలు పేర్కొన్నారు. నాణ్యమైన మద్యం అంటే మహిళలపై హింస జరగకుండా, ప్రమాదాలను నివారించేలా ఉంటుందా? అని మహిళా నేతలు ప్రశ్నించారు.
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గాంధీ విగ్రహానికి మహిళలు, ఐద్వా నేతలు వినతిపత్రం అందించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఐద్వా, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యాన నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటం మానుకోవాలన్నారు. ప్రయివేటు దుకాణాల వలన బెల్ట్ షాపులు అధికమయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జెవివి రాష్ట్ర నాయకులు జిఎస్.శర్మ పాల్గొన్నారు.
నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వద్ద నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట మద్యం సీసాలను ధ్వంసం చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. తిరుపతిలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జయంతి, డాక్టర్ పి.సాయిలక్ష్మి డిమాండ్ చేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, జెవివి నాయకులు ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళా సంఘం (ఐద్వా అనుబంధం) ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా హుకుంపేటలో ఆందోళన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని చించినాడ గ్రామంలో అరుంధతిపేట, పెదపేట, విప్పర్తివారిపేట తదితర ఏరియాల్లో నిరసన చేపట్టారు. ఆకివీడులో రైల్వేస్టేషన్ రోడ్డులోని గేటు వద్ద ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం, కళ్యాణదుర్గం, కడప జిల్లా బద్వేలు, విజయనగరంలో మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.