ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన జారు జమీమా హనీ ట్రాప్ కేసులో ప్రధాన ముఠా సభ్యుడు వేణుభాస్కర్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా నిందితుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో దాక్కొని తప్పించుకు తిరుగుతుండటంతో పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వేణు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వేణు భాస్కర రెడ్డి జమీమాతో సహజీవనం చేసి, ఆమె చేసిన నేరాల్లో ప్రధాన సభ్యుడుగా ఉంటూ దాడులు, హత్యా ప్రయత్నాలలో భాగమయ్యాడు. వివాహమైన పురుషులను మత్తులోనికి దించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించాడని, బెదిరింపుల ద్వారా భారీగా నగదు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో మరి కొన్ని ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో ఇంకా దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు. జారు జమీమా విశాఖపట్నంలో ధనికులు, వివాహమైన పురుషులను లక్ష్యంగా చేసుకుని వారితో మోసపూరిత ప్రేమాయణం, సహజీవనం, నిశ్చితార్థాలు చేసుకుని వారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి చివరకి వారిపై దాడులు, హత్యా ప్రయత్నాలు చేయించి అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం విదితమే.