- గత పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం : హోం మంత్రి
- అనంతలో ఘనంగా డిఎస్‌పి పాసింగ్ అవుట్ పరేడ్
ప్రజాశక్తి – అనంతపురం క్రైం : రాష్ట్రంలో శాంతిభద్రతల రక్షణే కీలకంగా నిజాయితీ, నిబద్ధతతో పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది ప్రొబేషనరీ డిఎస్‌పిల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. హోం మంత్రితో పాటు డిజిపి ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రొబేషనరీ డిఎస్‌పిలకు దిశానిర్దేశం చేశారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం మిగతా ఉద్యోగాల వంటిది కాదని, ఇందులో 24/7 విధుల్లో ఉండాల్సి ఉంటుందని, నిజాయితీ, నిష్పక్షపాతం, బాధితుల పట్ల సానుభూతి, విధుల పట్ల నిబద్ధత కలిగి ఉండాలన్నారు. పోలీసు శాఖకు అన్ని సౌకర్యాలూ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ఐదేళ్లలో పోలీసుశాఖ నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు. గ్రేహాండ్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం రూ.తొమ్మిది కోట్లకు యుసిసి ఇవ్వకపోవడం వల్ల రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగితే ముఖ్యమంత్రే స్వయంగా ఆయా జిల్లాల ఎస్‌పిలతో మాట్లాడి అప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి మహిళలు, చిన్నారుల రక్షణపై ఉన్న చిత్తశుద్ధి అవగతం అవుతోందన్నారు. శిక్షణ సమయంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్ డోర్ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ప్రొబేషనరీ డిఎస్‌పిలకు పతకాలు, ట్రోఫీలను హోం మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పిటిసి ప్రిన్సిపల్, ఐజిపి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పోలీసు శాంతిభద్రతల విభాగం ఐజిపి సిహెచ్.శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డిఐజి డాక్టర్ షిమోషి తదితరులు పాల్గొన్నారు.
గత తప్పులను సరిదిద్దుతున్నాం : డిజిపి
శాంతిభద్రతల రక్షణ విషయంలో గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని, ప్రస్తుతం వాటిని సరిదిద్దడంపై దృష్టిపెట్టామని డిజిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని, రాజకీయ ఒత్తిళల్లో పనిచేయబోమని స్పష్టం చేశారు. ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పటికీ బాధ్యతగా వ్యవహరించలేదని, ఈ ఘటనపై మూడేళ్ల తర్వాత చర్యలు తీసుకోవడం ఏమిటని కొందరు ప్రశ్నించడం సరికాదన్నారు. తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాత కూడా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. కేరళలో తప్పు జరిగిన 20 ఏళ్ల తర్వాత ఓ ఐపిఎస్‌కు శిక్ష విధించారని తెలిపారు. ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వినియోగించలేదన్నారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఐజి సంజరుపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరుగుతోందని చెప్పారు. ఆయనపై విచారణ నివేదిక జిఎడికి వెళ్లిన తర్వాత తమకు వస్తుందని తెలిపారు.