నా కూతురితో సంక్రాంతి చేసుకోనివ్వలేదు : మంచు మనోజ్‌

Jan 16,2025 21:44 #Manoj

ప్రజాశక్తి – రామచంద్రాపురం (చంద్రగిరి) : ‘సంక్రాంతి పండుగకు ఇంటికి రానివ్వలేదు.. ఇంట్లోకి వెళ్లకుండా.. నా కూతురితో సంక్రాంతి చేసుకోనీకుండా అడ్డుకున్నారు’ అని సినీ హీరో మంచు మనోజ్‌ వాపోయారు. మంచు మనోజ్‌ గురువారం చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై డిఎస్‌పి ప్రసాద్‌రావు, సిఐ సుబ్బరామిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన భార్య మౌనికపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌ వద్ద మౌనికతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాదీ వచ్చినట్లే ఈ ఏడాదీ సంక్రాంతి పండక్కి వచ్చానని, అయితే సొంతూరులో సంక్రాంతి జరుపుకునే అదృష్టాన్ని తనకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సమస్యను పరిష్కరించాలని సిఎం చంద్రబాబునాయుడును గానీ, మంత్రి నారా లోకేష్‌నుగానీ, ఎమ్మెల్యే పులివర్తి నానిని తాను అడగలేదన్నారు. మర్యాదపూర్వకంగానే లోకేష్‌ను కలిశానని తెలిపారు. తన కుటుంబంలో కూర్చుని మాట్లాడుకుంటే సర్ధుకుపోయే సమస్యలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తన ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా మనోజ్‌కు కడుపు నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. మంచు మనోజ్‌ అనుచరులు పళణి, వినాయక మాట్లాడుతూ.. తమపై విద్యానికేతన్‌ వద్ద భౌతికదాడులు జరిగాయని చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

➡️