పట్టాలు తప్పిన గూడ్సు – పలు రైళ్లు రద్దు

పెద్దపల్లి (తెలంగాణ) : జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. పెద్దపల్లి – రాఘవాపూర్‌ దగ్గర మంగళవారం రాత్రి సమయంలో ఓవర్‌ లోడ్‌ కారణంగా ఆరు గూడ్స్‌ భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించింది. గూడ్స్‌ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు తెలియజేశారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌, కాచిగూడ-నాగర్‌సోల్‌, కాచిగూడ-కరీంనగర్‌, సికింద్రాబాద్‌-రామేశ్వరం, సికింద్రాబాద్‌-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి, అకోలా-పూర్ణ, ఆదిలాబాద్‌-నాందేడ్‌, నిజామాబాద్‌-కాచిగూడ, గుంతకల్లు-బోధన్‌ రైళ్లను రద్దు చేశారు.

➡️