రాజ్యసభ రేసులో పలువురు

Sep 30,2024 03:01 #JanaSena, #leaders, #Rajya Sabha race, #TDP
  • టిడిపికి రెండు, ఒకటి జనసేనకు?
  • పోటీలో నాగబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీట్లను పలువురు టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నేతలు ఆశిస్తున్నారు. వైసిపి నుంచి ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఛైర్మన్‌ కూడా ఈ రాజీనామాను ఆమోదించారు. త్వరలో ఈ మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. శాసనసభలో కూటమి ప్రభుత్వం నుంచి 164 మంది, వైసిపి నుంచి 11 మంది ఉన్నారు. దీంతో ఈ మూడు సీట్లలో కూటమినే గెలుస్తోంది. రాజ్యసభలో ప్రస్తుతం టిడిపికి ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీ స్థాపించినప్పటీ నుంచి ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. కనకమేడల రవీంద్ర కుమార్‌ పదవీ కాలం ముగియడంతో గత ఏప్రిల్‌లో టిడిపి రాజ్యసభలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు రాజీనామాలతో మరోసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం చేసే అవకాశం టిడిపికి వచ్చింది. జనసేన పార్టీ పదేళ్ల ప్రస్థానంలో ఇప్పటి వరకు రాజ్యసభలో స్థానం పొందలేదు. తొలిసారిగా జనసేన కూడా రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన మూడు సీట్లలో రెండు టిడిపికి, ఒకటి జనసేనకు కేటాయించేలా మూడు పార్టీల మధ్యం ఒప్పందం జరుగుతున్నట్లు తెలు స్తోంది. మిత్రపక్షమైన బిజెపికి దక్కే అవకాశం లేదు. బీద మస్తాన్‌రావు త్వరలో టిడిపిలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజీనామా చేసిన సీటును తనకే ఇవ్వాలనే షరతును ఆయన పెట్టినట్లు సమాచారం. దీంతో మూడింట్లో ఒక సీటును టిడిపి తరపున బీదకు మరలా వచ్చే అవకాశం ఉంది. మరో సీటును ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ టిడిపి నేతల్లో నెలకొంది. ఆశావాహుల్లో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మాజీ ఎంపిలు కంభంపాటి రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్లు వినబడుతున్నాయి. వీరితోపాటు మరికొంత మంది నేతలు కూడా ఆ పార్టీ నుంచి ప్రయత్నిస్తున్నారు. కమ్మ సామాజిక తరగతి నుంచి గల్లా జయదేవ్‌ గానీ, కంభంపాటి రామ్మోహన్‌రావులలో ఒకరికి ఉండే అవకాశం ఉంటుంది. బిసి సామాజిక తరగతి నుంచి యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్రకుమార్‌కు అవకాశం ఉండొచ్చు. ఎస్‌సి సామాజిక తరగతి నుంచి వర్ల రామయ్యకు అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. జనసేన నుంచి నాగబాబుకే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో నాగబాబు టికెట్‌ ఆశించినా ఎక్కడా పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. నాగబాబును ప్రతిపాదిస్తే వ్యతిరేకత రాదనే ఆలోచన ఆ పార్టీలో ఆలోచిస్తుంది.

➡️