దోచుకోవడంలో శ్రద్ధ… కార్మికుల పట్ల అశ్రద్ధ

Jan 27,2024 16:20 #Hamali Workers, #Kurnool, #Protest
market hamali protest in kurnool

కార్మికుల సమస్యలు పట్టని పాలకమండలి
అసౌకర్యాల నిలయంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్
మార్కెట్ హమాలి సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఏళ్లు గడుస్తున్నా హమాలి కార్మికుల సమస్యలు తీర్చడం లేదని కమిషన్ల కక్కుర్తి లో దోచుకోవడం దాచుకోవడంలో ఉన్నంత శ్రద్ధ కార్మికుల సమస్యలు తీర్చడంలో ఉండాలని మార్కెట్ యార్డ్ హామీలి సంఘాల గౌరవాధ్యక్షులు టి.రాముడు అన్నారు.శనివారం మార్కెట్ హమాలి యూనియన్ నాయకుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కోత కూలి, చాట కూలి, పట్టుబడి, లోడ్ ఆన్ లోడ్, తదితర కార్మికులతో దాదాపు 500 మందితో మార్కెట్ లో ర్యాలీ నిర్వహించి మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్.రాధాకృష్ణ, శ్రామిక మహిళ సంఘం జిల్లా కార్యదర్శి నిర్మల, గౌరవాధ్యక్షులు టి.రాముడు హాజరయి మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో ఏళ్ళు గడుస్తున్నా కార్మికులకు యూనిఫామ్, గుర్తింపు గా ఐడి కార్డులు, మహిళలకు, పురుషులకు మరుగుదొడ్లు, త్రాగడానికి మంచి నీళ్ళు టాంక్స్ ఏర్పాటు, చనిపోయిన కార్మికులకు ఇన్సూరెన్స్ మంజూరు, జంబో షెడ్డు నిర్మాణం, రోడ్లు వేయడం వల్ల విద్యుత్ స్తంభాల తీగలు కిందకు ఉండటం వల్ల లోడింగ్ హమాలీలు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఈ డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా పలుసార్లు ధర్నాలు ర్యాలీలు నిర్వహించిన మార్కెట్ కమిటీకి, పాలకమండలికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. దాదాపు 2 వేల మంది కార్మికులు ఉండే చోట మార్కెట్ కు లక్షల ఆదాయాన్ని ఇస్తున్న కార్మికుల కనీస అవసరాలు తీర్చలేని కమిటీ ఉండటం దురదృష్టకరామన్నారు.పాలకమండలి నిర్లక్ష్యం విడి కార్మికుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. గతేడాది ఎండ తీవ్రతకు, గుండెపోటుతో హమాలి కార్మికులు మరణిస్తే నేటికి కూడా ఇన్సూరెన్స్ అందకపోతే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా పాలకమండలి,మార్కెట్ అధికారులు తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కారం చేయాలని లేని పక్షంలో ధర్నాలతో కాకుండా మార్కెట్ బంద్, ఆమరణ దీక్షలు కూడా చేస్తామని హెచ్చరించారు. మార్కెట్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి గోవిందు లకు యూనియన్ నాయకులు వినతిని అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాగు నీటి ట్యాంకులు నాలుగు చోట్ల పెట్టిస్తామని, మరుగుదొడ్లను నిధులు మంజూరు అయ్యాయని త్వరలో నిర్మాణం చేపడతామని, యూనిఫామ్, గుర్తింపు కార్డులు త్వరలో ఇస్తామని ,షెడ్డు నిర్మాణం వీలైనంత త్వరగా నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ డిమాండ్లను 2 నెలలోపు అమలు చేయకుంటే ఈ పోరాటం మరింత ఉదృతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగరకార్యదర్శి సియచ్.సాయిబాబా, నాయకులు కె.సుదాకరప్ప, కె.ప్రభాకర్, ఉశేన్ వలి, హమాలి సంఘాల నాయకులు నాగరాజు, వెంకటస్వామి, దస్తగిరి, చిన్నబడేసా, రామక్రిష్ణ, మనోహర్, వెంకటేశ్వర్లు, మిన్నల్లా, నాగన్న, క్రీష్ణ, పరమేష్, మహిళ హమాలీలు నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️