నివాళులర్పించిన వామపక్ష నేతలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కారల్‌మార్క్స్ సిద్ధాంతమే దేశానికి రక్ష అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలోని కారల్ మార్క్స్ విగ్రహం వద్ద శుక్రవారం మార్క్స్ 142వ వర్థంతి సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో జీవ పరిణామ సిద్ధాంతకర్త డార్విన్, మానవ పరిణామ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ వీరిద్దరికీ ఉన్న ప్రత్యేక స్థానాన్ని అంగీకరించాలన్నారు. మత ప్రాతిపదికన సమాజాన్ని విభజించి, మెజారిటీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కలిగించేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కారుసాల సుబ్బారావమ్మ మాట్లాడుతూ దోపిడీ రహిత సమాజ నిర్మాణానికి వర్గ పోరాటం అనివార్యమన్న కారల్ మార్క్స్ స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు పద్మ, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, పలువురు వామపక్ష పార్టీల నేతలు, యువజన సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.
