- హెచ్‌ఎంపివి వైరస్ నేపథ్యంలో అలర్ట్
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : దేశవ్యాప్తంగా హెచ్‌ఎంపివి కేసులు నమోదు కావడంతో అటు భారత ప్రభుత్వం, ఇటు తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా ఈ వైరస్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం నుంచి వైకుంఠ ద్వారదర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్రికులు మాస్క్‌తో పాటు స్వీయ జాగ్రత్తలు పాటించాలని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైరస్ నేపథ్యంలోయాత్రికులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి గోవిందమాల యాత్రికులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లూ ఉండవన్నారు. అందరు యాత్రికులతో కలిసి ఎస్‌ఎస్‌డి టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లు, టికెట్లు లేని యాత్రికులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేయడంపై మండిపడ్డారు. తిరుమలకు వచ్చే యాత్రికులను ఎవరూ ఆపబోరన్నారు.
నేడు ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ
వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ విధానంలో మార్పు చేశారు. గతంలో తెల్లవారుజామున రెండు గంటలకు టోకెన్లు ఇస్తామని టిటిడి ప్రకటించింది. స్వల్ప మార్పులు చేస్తూ గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. రోజుకు 40 వేల చొప్పున సర్వదర్శనం యాత్రికులకు టోకెన్లు జారీ చేయనున్నారు.