బీజాపూర్‌లో ఎదురు కాల్పులు-9 మంది మావోయిస్టులు మృతి

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి కర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తూ రాజకీయ నాయకుల లక్ష్యంగా కదులుతున్నట్టు గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు దండకారణ్యాన్ని కొద్ది రోజులుగా జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వరుస కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. పలువురు మావోయిస్టులు మృతి చెందారు. తాజా ఎదురు కాల్పుల వివరాలను బీజాపూర్‌ ఎస్‌పి ఎ.వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం… గంగలూరు అటవీ ప్రాంతానికి పోలీసు బలగాలు మంగళవారం కూంబింగ్‌ నిమిత్తం వెళ్లాయి. వారికి మావోయిస్టులు తారసపడ్డారు. వారి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన కరపత్రాలు, మందు గుండు సామగ్రి, వైర్లు పోలీసులకు లభ్యమయ్యాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

➡️