శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో భారీ దొంగతనం

హైదరాబాద్‌ : శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో భారీ దొంగతనం కలకలం రేపింది. మండపేట నుండి హైదరాబాద్‌ వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులోని ఓ మహిళా ప్రయాణీకురాలి బ్యాగ్‌ లో రూ.15 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను కొందరు దుండగులు చోరీ చేశారు. బ్యాగ్‌ లో బంగారం కనిపించకపోవడంతో బాధిత మహిళ డయల్‌ 100కు కాల్‌ చేసింది. బస్సు డ్రైవర్‌ కు వద్దకు వెళ్లి బాధిత మహిళ తెలపడంతో, రామోజీ ఫిల్మ్‌ సిటీ వద్ద బస్సును ఆపేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో బస్సును అబ్దుల్లాపూర్‌ మెట్టు పోలీసు స్టేషన్‌ కు తరలించారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ … బస్సు ఎక్కేటప్పడు తన బ్యాగులో రూ. 15లక్షల విలువగల బంగారు ఆభరణాలు తీసుకుని బయలు దేరానని తెలిపింది. తన వద్దే బ్యాగు ఉందని, అయితే ఇంతలోనే బ్యాగ్‌ నుంచి బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో అందరూ ఉన్నా.. బంగారం ఎవరు తీశారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. మహిళ వద్ద రూ.15 లక్షల బంగారం ఉందని బస్సులో ఎవరికి తెలిసిందని ఆరా తీస్తున్నారు. బస్సును పోలీస్టేషన్‌ వద్దకు తరలించి చెక్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బస్సు మధ్యలో ఎవరైనా దిగారా ? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే బస్సును పోలీస్టేషన్‌ కు తరలించడంతో ఉదయం 6 గంటల నుంచి ప్రయాణికులు పోలీస్టేషన్‌ లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా ఉండటంతో తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పోలీస్‌ స్టేషనల్‌ లోనే ఉన్నామని, చిన్న పిల్లలను తీసుకుని ఎంత సేపు ఉండాలని మండిపడుతున్నారు. బ్యాగులు సర్చ్‌ చేశారని, అయినా కూడా ఎవరిని బయటకు అనుమతించడం లేదని వాపోతున్నారు.

➡️