ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మే 4న సాంస్కృతికోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్ జిఎస్.రాజేశ్వరరావు తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ సాంస్కృతికోత్సవాల్లో నగరంలోని సంఘటిత రంగ, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైనా పాల్గనవచ్చని తెలిపారు. పాల్గనే వారు సామాజిక న్యాయం, మహిళా సాధికారికత, సమైక్యత, సమానత్వం, దేశభక్తి, వంటి అంశాలపైగానీ, అభ్యుదయ భావాలు కలిగిన కళారూపాలనుగానీ ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న వారు, జివిఎంసి, స్కీం వర్కర్లు, ఉపాధ్యాయులు కళారూపాలు ప్రదర్శించడానికి ముందుకొచ్చారని తెలిపారు. విజయ శ్రీ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ కెవి.విజయవేణి మాట్లాడుతూ నగరంలోని డ్యాన్స్ అకాడమీలకు చెందిన బృందాలు కూడా ఈ ఉత్సవంలో పాల్గంటాయని, శ్రామిక గీతాలకు శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శిస్తాయని తెలిపారు. గురజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి దండు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పాల్గనే వ్యక్తులు, బృందాల పేర్లను ఈ నెల 20లోగా పంపాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ సభ్యులు బుజ్జి, ఎం.ఎల్లాజీ, డాక్టర్ కె.పద్మ, సతీష్, సత్యనారాయణ, కామేశ్వరరావు పాల్గన్నారు.
