- కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
ప్రజాశక్తి-నెల్లూరు : రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్‌లో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను నెల్లూరు ఎపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మత్స్య యోజన పథకం కింద కోట్లాది రూపాయలు రాష్ట్రాలకు అందిస్తోందన్నారు. మత్స్యకారులకు రాయితీలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పోర్టులు, జెట్టీలు, ఫిష్ లాండ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందన్నారు. మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తమిళనాడుకు చెందిన కడలూరు జాలర్లు నెల్లూరు ప్రాంతంలో ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్‌ను రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. చేపలు తినడం వల్ల ప్రజలు గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, చర్మ సౌందర్యం, కంటిచూపు బాగా ఉంటుందన్నారు. ఎపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే నెల్లూరు చేపల పులుసుకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.