ప్రజాశక్తి- సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : దళితులపై దాడులు అరికట్టాలని, వివక్ష రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అండ్ర మాల్యాద్రి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా లింగన్న బలపరిచారు. దళితులపై కొనసాగుతున్న అమానుష దాడులు, హత్యలను నివారించాలని, దుర్మార్గాలకు పాల్పడుతున్న కుల దురహంకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని, 41 ఎపిఆర్‌ఆర్‌పి కింద బెయిల్ ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పటిష్టంగా అమలు చేయాలని, సామాజిక న్యాయాన్ని కాపాడాలని ప్రభుత్వాలను మహాసభ డిమాండు చేసింది.
