ప్రజాశక్తి – అనంతపురం : ‘ నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కాదు…ఒత్తిడి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి మెడికల్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం మెడికల్ కళాశాలలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన గిద్దలూరు వీర రోహిత్ (22) అనంతపురం నగరంలోని మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కుటుంబ సభ్యులు ఫోను చేసినా స్పందించకపోవడంతో అదే కళాశాలలోని తమ సమీప బంధువు విద్యార్థికి సమాచారం తెలపడంతో అతను హాస్టల్ గదికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ రోహిత్ కనిపించారు.
ఆస్పత్రి క్యాజువాలిటీకి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హాస్టల్ గదిని పరిశీలించగా సుసైడ్ నోట్ లభించింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. ఒత్తిడి నుంచి బయటపడలేక చనిపోయినట్టు ఆ లేఖలో రాసి ఉందని పోలీసులు తెలిపారు.