కార్మికుల ఆనవాళ్లను గుర్తించిన క్యాడవర్‌ డాగ్స్‌

Mar 9,2025 09:11 #Acident, #SLBC Tunnel
  • నేటి నుంచి రోబోలను దించనున్న ప్రభుత్వం

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో మూడు చోట్ల కార్మికుల ఆనవాళ్లను క్యాడవర్‌ డాగ్స్‌ గుర్తించాయి. ఆ ప్రాంతాల్లో తవ్వేందుకు రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్లాయి. ఈ ప్రమాదం ఒక జాతీయ విపత్తు అని, కార్మికులను వెలికితీయడానికి, సహాయక చర్యల్లో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే, జిపిఆర్‌ స్కాన్‌, కేరళ డాగ్స్‌ను రంగంలోకి దింపినా ఉబికి వస్తున్న నీటి ఊట వల్ల సహాయక చర్యలు ముందుకు సాగడం లేదన్నారు. చివరి 50 మీటర్ల నిడిది పూర్తిగా ప్రమాదకరంగా మారిందని తెలిపారు. టన్నెల్‌ పై భాగం నెర్రెలు బారి కూలడానికి సిద్ధంగా ఉందని, అందుకే టన్నెల్‌లో పని చేయాలంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. కార్మికులను గుర్తించడానికి ఆదివారం నుంచి రోబోలను దించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సొరంగంలో కేరళ క్యాడవర్‌ డాగ్స్‌ ముగ్గురు కార్మికుల ఆనవాళ్లు గుర్తించినట్టు అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించడానికి ఈనెల 11న సిఎంతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

పొంచి ఉన్న ప్రమాదం

సొరంగంలో ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడినా 15 రోజులుగా కార్మికులను గుర్తించలేదు. జిపిఆర్‌ స్కాన్‌ ద్వారా కార్మికుల ఆచూకీ తెలుస్తుందని భావించారు. అయితే, జిపిఆర్‌ గుర్తించిన దగ్గర ఇనుప రాడ్లు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత కేరళ క్యాడవర్‌ డాగ్స్‌ను సొరంగంలోకి పంపి రెండ్రోజులుగా కార్మికుల ఆచూకీ కోసం గాలించారు. ఊట రాళ్లు పడుతుండటంతో కార్మికులకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేటి నుంచి రోబోలను ప్రభుత్వం రంగంలోకి దించనుంది.

➡️