తెలంగాణలో మెగా డిఎస్‌సి – 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఐలయ్యతోపాటు విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్‌ ఆరో తేదీన డిఎస్‌సి నోటిఫికేషన్‌ను గత ప్రభుత్వం విడుదల చేయగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. కొత్తగా 4,957 ఉపాధ్యాయ పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో 796 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి), 220 స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎ) కలిపి మొత్తం 5,973 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ గతనెల 26న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాత, కొత్త పోస్టులతో కలిపి 11,062 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈనెల నాలుగో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ఏప్రిల్‌ మూడున తుది గడువు విధించింది. దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి చెల్లించాలని, గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్ధుల వయస్సును 42 నుంచి 46 ఏండ్లకు పెంచారు. ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సిబిఆర్‌టి)ను నిర్వహించనున్నారు. రాతపరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం https://schooledu.telangana.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

➡️