- పలు జిల్లాల్లో పిఎఫ్ కార్యాలయాల వద్ద ఆందోళనలు
ప్రజాశక్తి – యంత్రాంగం : కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇపిఎస్ – 95 పెన్షనర్స్ ఆలిండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పిఎఫ్ కార్యాలయాల ఎదుట పెన్షనర్లు ఆందోళనలు చేపట్టారు. భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలని, సీనియర్ సిటిజన్ల్‌కు రైలు ప్రయాణ రాయితీలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.
విశాఖలోని మర్రిపాలెంలో ఉన్న రీజనల్ పిఎఫ్ కార్యాలయం సమీపంలో నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుధాకర్‌రావు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ రూ.9000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించకుండా అర్హులందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో పిఎఫ్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి.శంకరరావు, కార్యదర్శి ఒఎస్‌ఎన్ మూర్తి మాట్లాడారు.
కర్నూలు పిఎఫ్ కార్యాలయం ముందు ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె సుధాకరప్ప అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. బిఎస్‌ఎన్‌ఎల్ డిఓటి పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.యాకోబు పాల్గొన్నారు. కడప పిఎఫ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… పెన్షనర్ల సమస్యలపై గతంలో బిజెపి ప్రభుత్వం వేసిన హై పవర్ కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని పిఎఫ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం పిఎఫ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.