కెజిబివిల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్‌

  • ‘మండలి’లో కెఎస్‌ లక్ష్మణరావు, ఐవి ప్రత్యేక ప్రస్తావన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ (ఎంటిఎస్‌)ను వర్తింపజేసేందుకు గతంలో టిడిపి ప్రభుత్వం జారీ చేసిన జిఓ 40ను అమలు చేయాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. శాసనమండలి ‘ప్రత్యేక ప్రస్తావన’లో భాగంగా బుధవారం ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 350 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉన్నాయన్నారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1,632 మంది వివిధ హోదాల్లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరావు తెలిపారు. ప్రస్తుత డిఎస్‌సిలో 1,143 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని, దీంతో తమ ఉద్యోగాల భద్రత గురించి వీరు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, డిఎస్‌సిలో వెయిటేజ్‌ ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అపార్‌ కార్డుల ఐడి క్రియేషన్‌ విషయంలో ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని, నిర్ణీత గడువు పొడిగించాలని, 10వ తరగతి పరీక్షలు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించాలని ఎమ్మెల్సీ పి రఘువర్మ కోరారు. ఆచంటలో బాస్టాండ్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వి రవీంద్రనాథ్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

➡️