- రాష్ట్రవ్యాప్తంగా పురాతన ఆలయాలకు పూర్వవైభవం
- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు : రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలతో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అరసవెల్లిలోని సూర్య భగవానుడి ఆలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అరసవెల్లిలో ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, ఆ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి పట్టువస్త్రాలు సమర్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పురాతన ఆలయాలను ఆగమశాస్త్రం ప్రకారం పున:నిర్మించి పూర్వవైభవానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో 18 ప్రసిద్ధ ఆలయాల పునర్ నిర్మాణానికి రూ.38 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో వైభవంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లు కోవూరు జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఇఒ అర్వభూమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.