అర్చకుల వేతనాలు రూ.15 వేలకు పెంపు : మంత్రి ఆనం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రూ.50 వేలకు పైబడి ఆదాయం వచ్చే ఆలయాల్లో పనిచేసే అర్చకులకు చెల్లించే కనీస వేతనం రూ.15 వేలకు పెంచేందుకు సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాల పెంపు వల్ల 1,683 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కనీస వేతనం రూ.15 వేల కంటే తక్కువ పొందుతున్న అర్చకులకు కొత్త వేతనం కింద రూ.15 వేలు చెల్లించడం ద్వారా దేవాదాయశాఖకు రూ.10 కోట్ల వరకు అదనపు వ్యయం అవుతుందని తెలిపారు. ఇందులో కొంత భాగాన్ని సిజిఎఫ్‌ నుంచి చెల్లిస్తామని, మొత్తం లబ్ధిపొందే అర్చకులు 3,203 మంది అని మంత్రి పేర్కొన్నారు. దేవాదాయశాఖ 1987 (30 సెక్షన్‌)లోని 70 సెక్షన్‌ను అనుసరించి అర్చకులకు చెల్లించే కనీస వేతనాన్ని దేవాదాయశాఖ భరిస్తుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు ఇతర వర్గాలకు, అర్చకులకు, వేద పండితులు, వేదాధ్యయన విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగ భృతితో సహా ఎన్నికల ప్రణాళికలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక శాఖ దేవాదాయశాఖ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

➡️