ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు తావులేకుండా , శాంతి భద్రతల పరిరక్షణ కోసమే సెక్షన్ 30ని అమలు చేసినట్లు హోంశాఖమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దీనిని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లడానికి మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. జగన్ తిరుమలకు వెడుతున్నట్లు ప్రకటించడంతో వైసిపి నేతలు భారీ జనసమీకరణకు సిద్ధమయ్యారని. మరోవైపు జగన్‌ను అడ్డుకుంటామని ధార్మిక సంఘ నేతలు చెప్పారని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు, భక్తులకు ఇబ్బంది కలగకూడదని సెక్షన్ 30 నోటీసులు ఇచ్చారని తెలిపారు. కుంటిసాకుతో జగన్ తిరుమలకు ఆగిపోయారని పేర్కొన్నారు.
అమాయకత్వంగా నటిస్తున్న జగన్
డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకొని తన మతం మానవత్వం అంటూ అమాయకత్వం నటిస్తున్నారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి విమర్శించారు. దళితుడైన సుబ్రహ్మణ్యంను తన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మానవత్వం ఏమైందని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత కన్నీరు కార్చినప్పుడు, అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టినప్పుడు మానవతం ఏమైందని నిలదీశారు.