మెరుగైన రహదారులే లక్ష్యం :  మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలకు మెరుగైన రహదారులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డిబి) రోడ్ల పనుల పురోగతిపై ఆయా కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్‌డిబి రోడ్ల పనులు పున్ణప్రారంభించామని, ఈ క్రమంలో ఎదురయ్యే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే 80 శాతం రోడ్లను గుంతల రహితం చేసినట్లు చెప్పారు. ఎన్‌డిబి రోడ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్‌డిబి రోడ్ల కాలపరిమితిని 2026 వరకూ పొడిగించాలని కోరారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. పెండింగ్‌ బిల్లులనూ త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి ఇఎన్‌సి నయీముల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️