పర్యాటక అభివృద్ధికి కృషి : మంత్రి దుర్గేష్‌

  • పిచ్చుకలంకలో ఒబెరాయ్ ప్రతినిధుల పర్యటన

ప్రజాశక్తి – ఆత్రేయపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయత గల పిచ్చుకలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. డాక్టర్‌ బిఆర్‌ అంబద్కేర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో ఒబెరాయ్ గ్రూపు ప్రతినిధులు ఆర్‌.శంకర్‌, నవీన్‌గోస్వామిలతో కలిసి మంత్రి దుర్గేష్‌ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ హోటళ్ల ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారన్నారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒబెరాయ్ ప్రతినిధులు పర్యాటక అభివృద్ధిపై చర్చించారని తెలిపారు. ఆ సమయంలో పిచ్చుకలంక గురించి వారి వద్ద ప్రస్తావించానని చెప్పారు. దీంతో ఒబెరాయ్ బృందం పిచ్చుకలంకకు సందర్శన నిమిత్తం వచ్చిందని తెలిపారు. ఇక్కడ రిసార్ట్స్‌ నిర్మిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కోనసీమ జిల్లాలో కేరళను తలపించే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ కడియం నర్సరీ ఆసియాలోనే ద్వితీయ స్థానాన్ని ఏర్పరచుకుందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఒబెరాయ్ సంస్థ భాగస్వామ్యం అవుతుందని వెల్లడించారు. వారి వెంట ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బండారు సత్యానందరావు, కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామినాయుడు, జిల్లా పర్యాటక అభివృద్ధికారి పి.వెంకటాచలం ఉన్నారు.

➡️