ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ ప్రమాదాల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వారి వివరాలపై అధికారులతో శనివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాలతో మరణించిన వారి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు విద్యుత్ షాక్‌తో మరణించిన వారి వివరాలపై నివేదిక తయారు చేయాలని చెప్పారు. భూమికి దగ్గరగా వైర్లు వేలాడటంతో విద్యుత్ షాక్ ప్రమాదాలతో ప్రజలు మరణిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వేలాడే వైర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. లైన్ల మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని వివరించారు. తరువాత సమీక్ష నాటికి పూర్తి సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చొరవ చూపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
