పర్యాటకం కోసం సిఆర్‌జడ్‌ నిబంధనలు సడలిస్తాం : మంత్రి కందుల దుర్గేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తీర ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి సిఆర్‌జడ్‌ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. వాటిని సడలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా శాసనసభలో సోమవారం ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ సిఆర్‌జడ్‌ నిబంధనల వల్ల విశాఖ తీర ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోదని చెప్పారు. ఆ ప్రాంత శాసన సభ్యులు ఈ విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. సముద్ర ఆధారిత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సిఆర్‌జడ్‌ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. తీరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లోను పర్యాకట అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

మరో ప్రశ్నకు సమాధానంగా… కృష్ణాజిల్లా ఘంటసాలలో చేపట్టిన శయన బుద్ద ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్‌’ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్ధిక సాయం రైతులకు అందిస్తామని ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. సభ్యుల ప్రశ్నకు సమాధానమిస్తూ… రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నుంచి భూమి లేని సాగుదారులందరికీ కూడా రూ.20 వేలు ఆర్ధిక సాయం అందిస్తామని మంత్రి చెప్పారు.

‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి గత ప్రభుత్వం రూ.119.11 కోట్లు ఖర్చు చేసిందని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వివిధ శాఖల నుంచి రూ.119.19 కోట్లు కేటాయించిందని, ఈ మొత్తంలో స్పోర్ట్‌ శాఖ నుంచి 37.63 కోట్లు, ఆర్‌ అండ్‌ బి శాఖ నుంచి రూ.38.55 కోట్లు, జిల్లా కలెక్టర్ల ఖాతాల నుంచి రూ.40.93 కోట్లు చొప్పున ఖర్చు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో 2024 జూన్‌ నాటికి 2,221.60 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఈ మొత్తంలో ఇప్పటి వరకూ రూ.1,745.60 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆరోగశ్రీ సేవలు నిలిపివేయడం వాస్తవం కాదన్నారు.

➡️