మెరుగైన వైద్య సేవలే లక్ష్యం : మంత్రి కొల్లు రవీంద్ర

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు ప్రారంభం

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తూ నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.2 కోట్ల విలువైన అధునాతన అల్ట్రాసౌండ్‌, సిఆర్‌ఎమ్‌ ఆంత్రోస్కోపిక్‌ యూనిట్‌లను ఎపిఎస్‌ ఆర్‌టిసి చైర్మన్‌ కొనకళ్ళ నారాయణతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. వైద్య పరికరాల పనితీరును పరిశీలించి వైద్యాధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కొల్లు ఫౌండేషన్‌ ద్వారా ఆస్పత్రికి స్ట్రెచర్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మీడియాతో మాట్లాడుతూ.. సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యూరాలజీ, న్యూరాలజీ, యూరో సర్జరీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కీళ్ల మార్పిడి, కార్డియాలజీ వైద్య సేవలు సైతం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గతంలో చిన్నాపురం, తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా మరో రెండు నూతన పిహెచ్‌సిలను త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆశాలత, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ భానుమూర్తి, ఆర్‌ఎంఒ డాక్టర్‌ నిరంజన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️