ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : మచిలీపట్నం నియోజకవర్గంలో పని చేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలు ఇవ్వటంతోపాటు మచిలీపట్నం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 5 సెంట్ల స్థలం కేటాయిస్తానని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా గురువారం మంత్రి రవీంద్ర తన నివాసంలో మచిలీపట్నం మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా పాత్రికేయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రవీంద్ర క్రాకర్స్, స్వీట్ బాక్స్‌లు అందజేశారు. ముందుగా పాత్రికేయులతో కలిసి క్రాకర్స్ కాల్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రధాన సమస్యగా ఉన్న నివేశన స్థలాల సమస్యపై త్వరలోనే జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో చర్చించి పరిష్కరిస్తామన్నారు. అర్హులందరికీ నివేశన స్థలాలు ఇవ్వటంతోపాటు పక్కా గృహ నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం మీడియా మిత్రులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.