మార్చి నాటికి విసిల నియామకాలు : సమీక్షలో మంత్రి లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విసిలు, అడ్వయిజరీ కౌన్సిల్‌ నియామకాలను మార్చి నాటికి పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరంలో కెజి నుంచి పిజి వరకు పాఠ్యప్రణాళిక సమూల ప్రక్షాళనపై ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీల్లో హాస్టళ్ల పనితీరును మెరుగుపర్చేందుకు వెబ్‌బేస్డ్‌ మెనూ, సూచన బాక్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూరివర్సిటీల్లో 36 శాతంగా ఉన్న గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 50 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే సలహామండలి సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టేక్‌ హోల్డర్లు, పాలసీ నిపుణులు, రీసెర్చ్‌ నిపుణులకు స్థానం కల్పించాలని ఆదేశించారు. పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్యప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఒకే పుస్తకంలో రెండు సెమిస్టర్ల పాఠ్యాంశాలు ఉండేలా పరిశీలించాలన్నారు. డిఎస్‌సిని పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్‌లో మేథ్స్‌, బోటనీ, జువాలజీ ఒకే పేపర్‌ ఉండేలా మార్పులు చేయడంపైనా, సిబిఎస్‌ఇ లో మాదిరి ఇంటర్నల్‌ మార్కుల విధానం అమలుపైనా, పాఠశాల విద్యలో డిజిటల్‌ ఎసెస్‌మెంట్‌ విధానం అమలు అవకాశాలపైనా చర్చించారు. జిఓ 117కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, పాఠశాల యాజమాన్యాల కమిటీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, కళాశాల విద్య డైరెక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా, పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

లోకేష్‌ సమక్షంలో రెండు ఒప్పందాలు

రాష్ట్రంలో విండ్‌ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కోసం సుజ్లాన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎస్‌ఎస్‌డిసి) మధ్య మంత్రి లోకేష్‌ సమక్షంలో ఒప్పందం కుదిరింది. సుజాఒన్‌ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్‌, బ్లేడ్‌ టెక్నాలజీ, సివిల్‌ లైసనింగ్‌ వంటి రంగాల్లో 12 వేల మందికి శిక్షణ ఇస్తారు. గ్రీన్‌ స్కిల్లింగ్‌ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్‌ సంస్థతో ఎపిఎస్‌ఎస్‌డిస్‌ మరో ఒప్పందం చేసుకుంది.

➡️