ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా డిఎపి, యూరియా బస్తాల్లో తూనికలు, ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూడాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరు కార్యాలయంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల, పురుగు మందులు తయారీదార్లు డీలర్లతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ దగ్గర్నుంచి కనీస మద్దతు ధర ప్రతిరైతుకూ అందేలా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధమవుతున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తూనికలు, కొలతల శాఖ నిర్వహించిన దాడుల్లో ఇప్పటి వరకు 252 కేసులు నమోదు చేశామన్నారు.
