పెంచిన ధరలతో రూ.100 కోట్లు ఆదాయం : మంత్రి రవీంద్ర

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మద్యం దుకాణాలకు 14 శాతం మార్జిన్‌ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం గండిపడే అవకాశం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బాటిల్‌పై రూ.10 పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల వరకూ ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. సచివాలయంలో పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మద్యం షాపులకు అత్యధికంగా 90 వేల దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి రూ.1,800 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం కలెక్టర్ల సమక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయించినట్లు చెప్పారు. కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయించామని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన వారు భంగపడ్డారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న ఆరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో షాపులు కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. రూ.99లకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, 12 రకాల పరీక్షలు నిర్వహించిన తదుపరే షాపులకు తరలిస్తున్నామని తెలిపారు. డిపోల నుంచి వచ్చే ఇండెంట్‌ ఆధారంగా మాత్రమే మద్యం కేటాయింపులు చేస్తున్నామన్నారు. బెల్టు షాపుల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా ఉందని, ట్రాక్‌ అంట్‌ ట్రేస్‌ విధానంలో ప్రతి బాటిల్‌నూ మానిటర్‌ చేస్తామన్నారు. సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలిపారు.

➡️