ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2030 నాటికి బోధకాలు వ్యాప్తిని నివారిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. బోధకాలు వ్యాధి విస్తరణను అరికట్టే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వర్చువల్‌లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే బోధకాలు నిర్మూలనకు ప్రతియేటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో మందుల సరఫరా జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాలోని గుర్ల, పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో మందుల పంపిణీ చేశారు. అనంతరం బోధకాలు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాల్ని మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, కమిషనర్ జి వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.
