ప్రజాశక్తి – అనకాపల్లి : పోలవరాన్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపంలోని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను పరిశీలిస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సిఎం హెలీకాఫ్టర్‌లో దార్లపూడి చేరుకుంటారని, అనంతరం భోగాపురం ఎయిర్ పోర్టు పనులను పరిశీలిస్తారని తెలిపారు. తదుపరి విశాఖపట్నం చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ అనిత పాల్గొన్నారు.
