‘ఉక్కు’ రక్షణకు మంత్రులు కృషి చేయాలి – పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

Jun 11,2024 21:50 #ukkunagaram, #visaka steel plant

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం కొత్తగా ఎన్నికైన మంత్రులు తమ వంతు కృషి చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1216వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు పరంధామయ్య, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌ మాట్లాడారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రం నుంచి ఎంపిగా ఎన్నికైన శ్రీనివాసవర్మ బాధ్యతలు స్వీకరించడంతో ప్లాంట్‌కు మేలు జరుగుతుందని భావిస్తున్నామని, విశాఖ ఉక్కుపై స్పందించాలని కోరారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని డిమాండ్‌ చేశారు. వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలని కోరారు. దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలకు ట్యాక్స్‌ హాలీడే ప్రకటించారని, అదే విధంగా విశాఖ ఉక్కుకు కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల వేతనాలను కార్మికులకు త్వరితగతిన ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు డియుఎస్‌వి.శ్రీనివాసరాజు, ఎన్‌వి.సాయి నాగబాబు, వేణుగోపాలరావు, దాసరి శ్రీనివాసరావు, జోషి, కె.మధుసూదన్‌రావు, వి.వెంకటరమణ ఎస్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️