ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం

  •  చంద్రబాబువి అబద్ధపు హామీలు
  •  మీ ఇంటి భవిష్యత్‌ కోసం వైసిపిని గెలిపించండి
  •  రేపల్లె, మచిలీపట్నం, మాచర్లలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి- యంత్రాంగం : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కూటమి నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబు అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లా రేపల్లె, కృష్ణా జిల్లా మచిలీపట్నం,పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో గెలవలేమని భావించి ఐవిఆర్‌ నుంచి ప్రజలకు ఫోన్‌కాల్స్‌ చేసి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భూ సర్వేలు లేకపోవడం వల్ల వివాదాలు ఏర్పడి కోర్టుల చుట్టూ భూ యజమానులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించి భూములపై యజమానులకు సంపూర్ణ హక్కులు ఉండేలా ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు అని వివరించారు. భూ యజమానులకు టైటిల్‌ ఉండేలా ఒక చట్టం తీసుకు రావడమే దీని ఉద్దేశమన్నారు. గతంలోనూ గంజాయి, మత్తు పదార్ధాలపై కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే మరోసారి మోసపోతారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు తీసివేస్తారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అతను చేసే మోసాలు ఏ స్థాయిలో ఉంటాయో గుర్తించాలన్నారు. గతంలో కూటమి పేరుతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మోడీ ఫొటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదని విమర్శించారు. పొత్తులో భాగంగా మళ్లీ ఈ ముగ్గురు కలిశారని, మేనిఫెస్టో పేరుతో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. మహిళల పేరుతో 31 లక్షల మందికి నివేశన స్థలాలు, అక్క చెల్లెమ్మల సాధికారత, స్వావలంబన కోసం ప్రత్యేక పథకాలు ఏనాడైనా చూశారా? అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల్లో చేసిన మార్పులు సంస్కరణలు మరో 15 సంవత్సరాలలో వెలుగులోకి వస్తాయన్నారు. పేదవాడి బతుకులు మార్చేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. మరో వారం రోజుల్లో జరగునున్న ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ ఇంటి భవిష్యత్తు కోసం, మరో ఐదు సంవత్సరాల సంక్షేమ పాలన కోసం ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి వైసిపిని గెలిపించాలని కోరారు. జగన్‌కు ఓటేస్తేనే ఇంటింటికీ భవిష్యత్‌ ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎంపి నందిగం సురేష్‌, రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ గణేష్‌, మచిలీపట్నం పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులు సింహాద్రి చంద్రశేఖర్‌, పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తదితరులు పాల్గొన్నారు.

➡️