కబ్జాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ : కదిరి ఎమ్మెల్యే కందికుంట

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ (శ్రీసత్యసాయి జిల్లా) : గత ప్రభుత్వ హయాంలో శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు, అక్రమ కట్టాడాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. కదిరి పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వంలో సహజ వనరులను అడ్డగోలుగా దోచేశారని, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని, జగనన్న కాలనీల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. గత ఐదేళ్లలో వైసిపి నాయకులు చేసిన భూ కబ్జాలన్నింటినీ వెలికి తీస్తామన్నారు. వీటిన్నింటిపైనా విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తాటతీస్తానని హెచ్చరించారు.

➡️