- ఆక్రమణల పేరిట తొలగించిన పునాదుల పరిశీలన
- విచారణ చేపట్టి వెంటనే నివేదికలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం
- అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసా
ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు బైపాస్ పక్కన గల డ్రైవర్స్ కాలనీలో ఆక్రమణల పేరిట ఇరువర్గాల మధ్య జరుగుతున్న గొడవలు పడ్డ అంశంపై పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగిస్తున్నారని మీడియా ముఖంగా కొందరు తెలియజేయడంపై ఆయన స్పందిస్తూ గురువారం ఉదయం స్థానిక నేతలతో కలిసి కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వాస్తవ పరిస్థితులను కాలనీ వాసులని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది ఇష్టానుసారం ఆక్రమణలకు పాల్పడి ప్రస్తుతం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పలువురు తెలియజేశారు. పేదలైన తమకు పట్టాలు ఉన్న కొందరు దౌర్జన్యంగా పునాదులను పెకిలించేశారని కొంతమంది బాధితులు ఆయనకు మొర పెట్టుకున్నారు. దీంతో మండల తహసిల్దారు శివకుమార్ ను అక్కడికి పిలిపించి కాలనీలో జరిగిన ఆక్రమణలపై పూర్తి విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం అర్హులైన పేదలందరినీ గుర్తించి పట్టాలతో పాటు ఇళ్ళను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని నిజమైన పేదలకు తప్పక న్యాయం చేస్తామని ఆయన భరోసా కల్పించారు. అదేవిధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సైతం సహించేది లేదని అలాంటివారు తమ వారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఆయన వెంటమండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రసాద్ నాయుడు, నాయకులు ఆనంద్, మురళి, గిరిధర్ గోపాలు, యుగంధర్, బాలాజీ,రవి తదితరులున్నారు.