ప్రజలపై విద్యుత్‌ భారాలు అంగీకరించం : ఎమ్మెల్సీ బొత్స

  • కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై పవన్‌ డ్రామా

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని అంగీకరించబోమని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టిడిపి కూటమి ప్రభుత్వం డిసెంబర్‌ నుంచి ప్రజలపై రూ.6,072 కోట్ల ట్రూ అప్‌ ఛార్జీల భారం వేస్తోందని తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారని, దీనిని విస్మరించి ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.25 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. ఫిబ్రవరి తర్వాత మరో రూ.9,412 కోట్ల భారం మోపబోతున్నారని, మొత్తంగా రూ.15,485 కోట్ల విద్యుత్‌ భారం వేస్తున్నారని తెలిపారు. ట్రూ అప్‌ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, దీనిపై పార్టీ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో రూ.67,237 కోట్ల అప్పులు చేసిందని, ఇంత అప్పు చేస్తున్న ప్రభుత్వం ట్రూ అప్‌ భారాన్ని భరించలేదా? రూ.15,485 కోట్లును డిస్కంలకు చెల్లించలేదా? అని ప్రశ్నించారు.
కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై డిప్యూటీ పవన్‌ డ్రామా నడిపాడని, కాకినాడ ఎమ్మెల్యేను ప్రశ్నించిన పవన్‌.. తన టిడిపి కూటమి మంత్రే ఆ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు మర్చిపోయారని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చారు. బియ్యం రవాణాపై సంబంధిత మంత్రి తనిఖీలకు వెళ్లొచ్చుగానీ డిప్యూటీ సిఎం ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తన మంత్రిపై అనుమానంతో కూడా అక్కడకు వెళ్లి ఉండవచ్చునని, డిప్యూటీ సిఎం చిత్తశుద్ధి ఏమిటో త్వరలోనే బయటకు వస్తుందన్నారు. పోర్టులో బియ్యం ఎగుమతులపై వ్యాపారులతో బిజెపి నేతలు సమావేశాలు నిర్వహించడం, ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అనుమతులు ఇప్పించడం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.

➡️