ప్రజాశక్తి-అమరావతి : వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం భావ్యం కాదని అన్నారు. అందుకే మరో మూడేళ్లు పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మండలి ఛైర్మన్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు. తన సన్నిహితులు, అనుచరులతో సంప్రదించి భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని… ఏ పార్టీలో చేరేది అప్పుడే ప్రకటిస్తానని తెలిపారు.
