బీద రవీచంద్ర, కావలి గ్రీష్మ, బిటి నాయుడులకు స్థానం
ఒక స్థానం బిజెపికి కేటాయింపు
నేడు నామినేషన్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న శాసనమండలి స్థానాలకు టిడిపి కూటమి తన అభ్యర్థులను ఖరారు చేసింది. టిడిపి నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావాలి గ్రీష్మ, కర్నూలు జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బిటి నాయుడు పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపికి ఒక స్థానాన్ని కేటాయించారు. అయితే ఆదివారం రాత్రి వరకు బిజెపి తన అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న బిటి నాయుడు, పి అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు మార్చి చివరి నాటికి పదవి విరమణ చేయనున్నారు. మొత్తం ఐదు స్థానాల్లో ఒక స్థానంలో ఇప్పటికే జనసేన నుంచి కొణిదెల నాగేంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాలకు గాను మూడు స్థానాల్లో టిడిపి తన అభ్యర్థులను ప్రకటించింది. ఆఖరి నిమిషంలో బిజెపికి ఒక స్థానం కేటాయించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారమే వీరంతా నామినేషన్లు సమర్పించనున్నారు.
ఆశావహులకు నిరాశే
ఎమ్మెల్సీ పదవి కోసం టిడిపిలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఎన్ సత్యనారాయణ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమామహేశ్వరరావు, కెఎస్ జవహర్, మోపిదేవి వెంకటరమణ, టిడి జనార్ధన్, పీతల సుజాత, కెఇ ప్రభాకర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, తిప్పేస్వామి, మహ్మద్ నజీర్, మంతెన సత్యనారాయణ రాజు, జంగా కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. పిఠాపురం సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు త్యాగం చేసిన సత్యనారాయణ వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఉంటుందని పార్టీలో అందరూ భావించినా అతనికి నిరాశ ఎదురైంది. టికెట్ ఇవ్వలేకపోతున్నామని వర్మతో పాటు మరికొంత మంది నాయకులకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. 2027లో ఖాళీ అయ్యే స్థానాల్లో అవకాశం కల్పిస్తామని అధినేత చంద్రబాబు చెప్పారని నేతలకు శ్రీనివాస్ సమాచారం ఇచ్చారు.
చివరి నిమిషంలో బిజెపి
బిజెపికి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ స్థానం దక్కింది. అయితే ఇటీవల రాజీనామాలతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక్కటి బిజెపికి కేటాయించామని, ఈసారి ఇవ్వలేమని చంద్రబాబు బిజెపికి చెప్పినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. కానీ చివరి నిమిషంలో తమకు కూడా ఇవ్వాలని బిజెపి ఒత్తిడి చేయడంతో ఆ పార్టీకి కేటాయించినట్లు తెలిసింది. దీంతో టిడిపి నాయకుల్లో ఒకరికి కోత పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.