ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘విద్యారంగ-ఆర్థిక సమస్యల సాధనకై ఉద్యమిద్దాం’ అనే అంశంపై యుటిఎఫ్ ఆధ్వర్యాన సదస్సు జరిగింది. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ సంఘం ఆడిట్ కన్వీనర్ టిఎస్ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 117 వల్ల పాఠశాల విద్య సంక్షోభం ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జిఓకు వ్యతిరేకంగా పిడిఎఫ్, యుటిఎఫ్ ఉమ్మడిగా పోరాటం చేశామని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఈ జిఓను రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ జిఓను అధికారికంగా రద్దు చేయలేదని పేర్కొన్నారు. దీనివల్ల బాలికలు ఎక్కువగా డ్రాపవుట్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయంపై ఒత్తిడి చేయవలసిందిపోయి ఉద్యోగుల జీతాలపై రాష్ట్రప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు తన నుంచి వచ్చే వాటాను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందన్నారు. గతంలో రాష్ట్రాలకు 42 శాతంగా ఉన్న పన్నుల వాటా ఇప్పుడు 32 శాతానికి తగ్గిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జిఎస్‌టి వల్ల సుమారు రూ.30 వేలకోట్లు రాష్ట్రానికి నష్టం వచ్చిందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కూడా కోతలు విధించిందన్నారు. సమగ్రశిక్షలో 75:25 శాతంగా ఉన్న కేంద్రం, రాష్ట్రం వాటాను 60:40 శాతంగా తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు తీవ్ర పోరాటం చేశారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడిగే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు. ఉద్యోగులకు ఒపిఎస్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల బకాయిలు చెల్లింపుపై తక్షణమే రూట్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగులకు 12వ పిఆర్‌సి కమిషన్ నియమించలేదన్నారు. ఉద్యోగులకు ఉన్న రూ.30వేల కోట్ల బకాయిలు కూడా చెల్లించడం లేదన్నారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ ముందు ఉద్యోగంలో చేరిన వారికి వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యలు, బకాయిలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరుబాట పడతామని హెచ్చరించారు. యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యా రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలే అమలవుతున్నాయని తెలిపారు. ఈ సంస్కరణల వేగాన్ని తగ్గించి పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, లేదంటే పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సహాధ్యక్షులు ఎఎన్ కుసుమకుమారి, బి లక్ష్మీరాజా, బి సుభాషిని, వి శ్రీలక్ష్మి, ఎ ఉమామహేశ్వరరావు, ప్రచురణల విభాగం ఛైర్మన్ ఎం హనుమంతరావు, జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి కె రామారావు తదితరులు పాల్గొన్నారు.
