ప్రజాశక్తి-విజయవాడ : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్‌టిసి విశ్రాంత ఉద్యోగుల సంఘం (రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గురువారం విజయవాడ పండిత్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఆర్‌టిసి రిటైర్డ్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కృష్ణా ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల నుండి పెన్షనర్లు పాల్గొన్నారు. పెన్షనర్ల ఆందోళనకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సాధారణ ప్రజలకు పింఛన్ రూ.4 వేలు ఇస్తుండగా ఆర్‌టిసి రిటైర్డ్ సిబ్బందికి రూ.వెయ్యి కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఉండడంతో సంక్షేమ పథకాలకు అనర్హులయ్యారని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న ఆర్‌టిసి ఆస్పత్రుల్లో వైద్యులను నియమించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. సూపర్ లగ్జరి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్‌టిసిలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా టిడిపి కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. జీవితాంతం సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్‌టిసి పెన్షనర్ల న్యాయమైన ఉద్యమానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధరరావు, అధ్యక్షులు గద్దె రవీంద్రరావు మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు.
