ఘనంగా మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం

ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌, మోదకొండమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కుటుంబీకులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. యాత్రికులతో కలిసి అమ్మవారి ఆలయం నుంచి శతకం పట్టు వరకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను, ఘటాలను తలపై ఉంచుకొని ఊరేగింపుగా వెళ్లారు. డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, గరగల డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను శతకంపట్టు వద్ద ప్రతిష్టించారు. వేలాది మంది యాత్రికులు పాడేరుకు వచ్చి శతకం పట్టు వద్ద కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. కొలువు ఉత్సవంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఘటాల ఊరేగింపు కన్నుల పండవగా సాగింది. శతకం పట్టు వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఎఎస్‌పి ధీరజ్‌ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించారు.

➡️