మోడీ, అమిత్‌షా వల్లే ‘ఉక్కు’కు విఘాతం

  • రాష్ట్ర విభజన హామీలను రాబట్టాల్సిన బాధ్యత టిడిపిదే
  • ప్రచార జాతాల్లో సిపిఎం నేతలు

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం 27వ మహాసభ ఫిబ్రవరి 1 నుంచి 3 వరకూ నెల్లూరులో జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ‘పోలవరం నిర్వాసితుల పోరాట పతాక జాతా’ ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ జాతా’, ‘పోలవరం నిర్వాసితుల పోరాట పతాక జాతా’, రాజధాని నిర్మాణం-రాష్ట్ర అభివృద్ధి జాతా, ‘కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు’ జాతాలు శుక్రవారం నెల్లూరుకు చేరుకున్నాయి. జాతాలకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని, ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ఆపాలని కోరుతూ చేపట్టిన ”విశాఖ ఉక్కు పరిరక్షణ ప్రచార జాతా”కు కావలిలో, విద్యుత్‌ ఛార్జీల భారాలను వ్యతిరేకించాలని, సెకి ఒప్పందాలను రద్దు చేయాలని, అదాని ముడుపులపై న్యాయ విచారణ జరపాలని, ట్రూ అప్‌ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును విరమించాలని కోరుతూ నంద్యాలలో ప్రారంభమైన ప్రచార జీపు జాతా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన ‘పోలవరం నిర్వాసితుల పోరాట పతాక జాతా’కు కావలిలో నాయకులు స్వాగతం పలికారు. రాజధాని ప్రాంత రైతుల ప్లాట్లపై బ్యాంకు రుణాలు ఇవ్వాలని, అసైన్‌ రైతులకు కూడా సమాన ప్యాకేజీ అమలు చేయాలని, రాజధాని ప్రాంత గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రాజధాని నిర్మాణం-రాష్ట్ర అభివృద్ధి జాతా నెల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మోడీ, అమిత్‌షాలు ఫీజుబులిటీ పేరుతో మోకాలడ్డుతున్నారని విమర్శించారు. ఫీజుబులిటీ లేదనడం సరికాదని, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం వల్లే జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ, అమిత్‌ షా వల్లే ఉక్కుకు విఘాతం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. విభజన హామీలను తుంగలో తొక్కేసారన్నారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత టిడిపి కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో సాగుతున్న ఉక్కు ఉద్యమానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కడప ఉక్కు, విశాఖ ఉక్కు ఎంత అవసరమో, రాజధాని కూడా అంతే అవసరమని తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల ప్లాట్లపై బ్యాంకు రుణాలు ఇవ్వాలని, అసైన్‌ రైతులకు కూడా సమాన ప్యాకేజీ అమలు చేయాలని, రాజధాని ప్రాంత గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో రాజధానికి ఎలాంటి సందిగ్ధత లేకుండా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు.

➡️